ప్రాణం తీసిన ఈత సరదా
గోదావరిలో నీట మునిగి ఇద్దరి మృతి
కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలో ఘటన
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం సమీపంలో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టడానికి గోదావరి నదిలోకి దిగిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపురం గ్రామానికి చెందిన నరేశ్, పండు, సంపత్ అనే ముగ్గురు యువకులు ఆదివారం మధ్యాహ్నం గోదావరి నదికి వెళ్లారు. నదిలో ఈత కొడుతుండగా ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ముగ్గురూ అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయారు. అయితే, సంపత్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలకు తెగించి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఇద్దరు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే సంపత్‌ను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు, జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంటసేపు వెతికిన అనంతరం నరేశ్, పండు మృతదేహాలను వెలికితీశారు. నరేశ్ లక్ష్మీపురంలో ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తుండగా, పండు అతని అక్క కుమారుడని గ్రామస్తులు తెలిపారు. చేతికి అందొచ్చిన ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.


మంత్రి సీతక్క పరామర్శ
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వారిని ఓదార్చారు. ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అకాల మరణం చెందిన యువకుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ఆకాంక్షించారు.

