మేం చంపుతాం.. పరిహారం ఇస్తాం..!
ఆస్పత్రుల విషయాలపై అడగడానికి మీరెవరు..?!
‘సినిమా అయిపోయింది.. ఇక వెళ్లండి
యశోద కృష్ణ ఘటనపై ఐఎంఏ సభ్యుల నిర్లక్ష్యపు వ్యాఖ్యలు
వైద్యం వికటించి మహిళ మృతి చెందిందంటూ బంధువుల నిరసన
రెండురోజులుగా కుటుంబ సభ్యులతో ఆస్పత్రి యాజమాన్యం సంప్రదింపులు రాజీ
రూ. 7 లక్షలకు ఒప్పందం.. తెరవెనుక కథ నడిపించిన ప్రజాప్రతినిధులు
ఫాలోపు వార్త కవరేజీ..వివరణలకు వెళ్లిన మీడియాపై ఐఎంఏ, యాజమాన్యం చిందులు

కాకతీయ, కరీంనగర్ : వైద్యం అంటే ప్రాణాలు పోయడం.. కానీ ప్రాణాలు తీసి వెలకట్టే సంస్కృతి ప్రైవేటు ఆస్పత్రుల్లో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ కోవకే చెందిన ఘటన మరోకటి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కరీంనగర్ మంకమ్మతోటలోని యశోద కృష్ణ హాస్పిటల్లో జరిగిన ఘటన చూస్తుంటే ప్రాణాలు వెలకట్ట తీయడం కూడా ఒక వ్యాపారంగా మారిపోయిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మేదరవాడకు చెందిన బెదరకోట చంద్రకళ (40) అనే మహిళ గర్భసంచి ఆపరేషన్ కోసం వచ్చి శవంగా మారడంతో నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి వద్ద బంధువుల ఆర్తనాదాలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. , పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ప్రాణం పోయిన బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలవాల్సిన వైద్య వర్గాలు.. అహంకారపూరిత వ్యాఖ్యలతో గాయంపై కారం చల్లడం విస్మయానికి గురిచేస్తోంది. మహిళ మృతి చెందిన రెండు రోజులుగా ఆసుపత్రి యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా రాజీ యత్నాలు కొనసాగించి, చివరికి లక్షల రూపాయలతో ప్రాణానికి వెల కట్టింది.
‘సినిమా అయిపోయింది’.. ప్రాణం అంటే అంత చౌకనా?
మహిళ మృతిపై వాస్తవాలు తెలుసుకోవడానికి, వివరణ కోరడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులకు ఆసుపత్రి యాజమాన్యం మరియు ఐఎంఏ సభ్యుల నుంచి ఎదురైన స్పందన అత్యంత దారుణంగా ఉంది. “సినిమా అయిపోయింది.. ఇక మీరు వెళ్లవచ్చు” అంటూ ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. అంతటితో ఆగకుండా, వైద్యుడికి మద్దతుగా వచ్చిన ఐఎంఏ సభ్యులు సైతం.. “మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు.. మీకు నచ్చింది రాసుకోండి” అంటూ చిందులు తొక్కారు. “మేము చంపుతాం.. పరిహారం ఇస్తాం.. అడగడానికి మీరెవరు?” అనే ధోరణిలో వారి ప్రవర్తన ఉండటం గమనార్హం. మేం ఏం చేసినా అడిగే వారు లేరనే ధీమా వారిలో స్పష్టంగా కనిపించింది. వృత్తి ధర్మాన్ని మరిచి, తోటి వైద్యుడి తప్పును కప్పిపుచ్చేందుకు మీడియాపై విరుచుకుపడటం గమనార్హం.
తెరవెనుక ‘రాజీ’ మంత్రాంగం.. ఏడు లక్షలకు ఒప్పందం!
బాధితుల ఆందోళనను చల్లార్చడానికి మరియు చట్టపరమైన ఇబ్బందుల నుంచి తప్పుకోవడానికి ఆసుపత్రి యాజమాన్యం తెరవెనుక రాజీ మంత్రాంగాన్ని ఆశ్రయించింది. కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, మధ్యవర్తుల సమక్షంలో రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చివరకు మృతురాలి కుటుంబానికి రూ. 7 లక్షల ఆర్థిక సాయం అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. మృతురాలి కుటుంబం నిరుపేదది కావడంతో, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా చేసేదేమీ లేక ఆ మొత్తానికి వారు తలొగ్గినట్లు తెలుస్తోంది. పోలీసుల సమక్షంలోనే ఈ రాజీ వ్యవహారాలు సాగడం, మీడియాను దరిచేరనీయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆపరేషన్ థియేటర్ లో ఏం జరిగింది? అనస్థీషియాలో లోపమా లేక వైద్యుడి నిర్లక్ష్యమా? అనే నిజాన్ని పాతిపెట్టి, కేవలం డబ్బుతో నోళ్లు మూయించే సంస్కృతి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల్లో పెచ్చుమీరుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, యశోద కృష్ణ హాస్పిటల్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.

