హనుమాన్ జయంతికి వేములవాడ సిద్ధం
తాగునీరు, టెంట్లు, గ్రీన్ మ్యాట్ల ఏర్పాటు
భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు
దేవస్థానం ఈవో రమాదేవి సమీక్ష
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 12న జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా దేవస్థానం అనుబంధ ఆలయాలైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, శ్రీ నగేశ్వర స్వామి ఆలయం, హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాల శుద్ధి పనులు, రంగులు వేయడం, రంగురంగుల పూలతో ప్రత్యేక అలంకరణలు చేపడుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని దేవస్థానం అధికారులు చర్యలు చేపడుతున్నారు.


భక్తుల సౌకర్యాలపై దృష్టి
హనుమాన్ జయంతి ఏర్పాట్లపై భీమేశ్వర సదన్ కాన్ఫరెన్స్ హాల్లో దేవస్థానం ఈవో రమాదేవి ఆలయ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేసవి తీవ్రత కారణంగా త్రాగునీరు, నీడ టెంట్లు, గ్రీన్ మ్యాట్లు వంటి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే లడ్డు కౌంటర్లు, అన్నదానం, ఉచిత పులిహోర పంపిణీ, ప్రత్యేక డ్యూటీలు సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఆలయ ప్రాంగణంతో పాటు పార్కింగ్ ప్రాంతాల్లో కూడా పారిశుభ్రతను మెరుగుపరచాలని ఆదేశించారు. హనుమాన్ జయంతి సందర్భంగా చిన్న జయంతి, పెద్ద జయంతి వేడుకలకు కొండగట్టు వెళ్లే ముందు అనేక మంది భక్తులు వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోందని ఈవో పేర్కొన్నారు. తెలంగాణలో ఏ పండుగ జరిగినా భక్తులు వేములవాడకు వచ్చి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషమన్నారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించి వారికి ఎదురయ్యే ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డీఈఓ, ఈఈ, ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ఆలయ అర్చకులు, దేవస్థానం ఉద్యోగులు పాల్గొన్నారు.

