వైద్యం ముసుగులో ‘వ్యాపార’ వికృతం!
రోగి నాడి చూడకముందే జేబుపై కన్నేస్తున్న ఆస్పత్రులు
హోటళ్లను మించిన బెడ్ చార్జీలు.. లాడ్జ్లను తలపిస్తున్న గదులు
నిబంధనలకు తిలోదకాలు.. గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లోనే చికిత్స
‘ఆరోగ్యశ్రీ’ నిధులే లక్ష్యంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న దవాఖానాలు
ఆహార సేవల పేరిట రెస్టారెంట్ స్థాయి వసూళ్లు
తనిఖీలకు దూరంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

కాకతీయ, వరంగల్ : వైద్యం అంటే ఒకప్పుడు ప్రాణదానం.. నేడు అది పక్కాగా ధనార్జన వ్యాపారంగా రూపాంతరం చెందింది. రోగి నాడి పట్టుకుని ప్రాణం పోయాల్సిన వైద్యం.. నేడు రోగి ఆర్థిక స్తోమతను బట్టి ‘బిల్లుల’ వైద్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు సాగిస్తున్న ఈ అక్రమ వసూళ్ల పర్వం సామాన్యుడిని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. జబ్బు చేసి ఆసుపత్రి గడప తొక్కితే చాలు.. అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు అడుగడుగునా దోపిడీ పర్వం నిరాటంకంగా సాగుతోంది. పెద్దపెద్ద వ్యాపార సామ్రాజ్యాలను తలదన్నేలా, ఆసుపత్రి యాజమాన్యాలు రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి.
ఇరుకు గదుల్లో నిర్బంధం!
సాధారణంగా ఏ వ్యాపార సంస్థకైనా వెళ్తే సందర్శన ఫీజులు ఉండవు. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో అడుగుపెడితేనే ‘కన్సల్టేషన్’ పేరిట రూ. 500 నుంచి రూ. 1,500 వరకు వసూలు చేస్తున్నారు. రోగికి చికిత్స అందించే గదుల పరిస్థితి అయితే మరీ దారుణం. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లోని గదులు లాడ్జ్లను తలపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం రోగి కోలుకోవడానికి గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలి. కానీ, లాభాలే పరమావధిగా భావిస్తున్న యాజమాన్యాలు.. ఇరుకైన గదుల్లో కేవలం ఒక బెడ్, టేబుల్ వేసి రోజుకు రూ. 500 నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేస్తున్నాయి. గాలి చొరబడని, వెలుతురు సోకని ఇరుకు గదుల్లో ఖైదీల మాదిరిగా రోగులకు నిర్బంధ వైద్యం అందిస్తూ వారిని మానసికంగా, ఆర్థికంగా నిర్వీర్యం చేస్తున్నారు.
‘ఆరోగ్యశ్రీ’ నిధులే ఆయుష్షు.. అదనపు వడ్డింపులు!
ప్రైవేటు ఆసుపత్రుల పుట్టగొడుగుల పెరుగుదలకు ‘ఆరోగ్యశ్రీ’ నిధులే ప్రధాన ఆకర్షణగా మారాయి. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆసుపత్రుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. ప్రభుత్వ నిధులను గుంజుకోవడమే లక్ష్యంగా కార్పొరేట్ వైద్యం విస్తరిస్తోంది. అయితే, కేవలం ప్రభుత్వ నిధులతోనే సంతృప్తి చెందని యాజమాన్యాలు.. రోగుల నుంచి అదనపు బిల్లులు వసూలు చేస్తూ రెట్టింపు లాభాలు గడిస్తున్నాయి. మందుల ధరల విషయంలోనూ నిలువు దోపిడీ సాగుతోంది. బయట మార్కెట్ లో రూపాయికి దొరికే మాత్రలకు కూడా ఆసుపత్రి ఫార్మసీల్లో వందల రూపాయలు వసూలు చేస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. మత్తు డాక్టర్లకు, కన్సల్టెంట్లకు ప్రత్యేక ఫీజుల పేరిట వేల రూపాయల భారం మోపుతున్నారు.
రెస్టారెంట్లుగా దవాఖానాలు..
వైద్య సేవలతో ఆగని ఈ వ్యాపారం.. ఇప్పుడు ఆహార రంగంలోకి సైతం చొచ్చుకుపోయింది. రోగులకు, వారి సహాయకులకు ఫుడ్ సర్వీస్ అందిస్తూ కార్పొరేట్ ఆసుపత్రులు హోటల్ వ్యాపారం చేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కిచెన్లను నిర్వహిస్తూ, రోగికి పెట్టే పత్యం ఆహారానికి సైతం రెస్టారెంట్ స్థాయి ధరలను వసూలు చేస్తున్నాయి. వైద్యం ముసుగులో హోటళ్లు, లాడ్జ్లు, రెస్టారెంట్ల మేళవింపుతో సాగుతున్న ఈ దందాపై నిఘా కరువైంది. ప్రభుత్వ నిబంధనలు కాగితాలకే పరిమితమవుతుండటంతో, కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి, నిబంధనలు ఉల్లంఘిస్తూ సాగిస్తున్న ఈ ‘వైద్య వికృత’ వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

