మునిసిపల్లో పవర్ బ్రోకర్
జమ్మికుంట మునిసిపాలిటీలో ‘వేతన’ దందా..
జీతాల పెంచుతామంటూ కార్మికుల నుంచి వసూళ్లు
ఒక్కోరి నుంచి రూ.70 నుంచి రూ.80వేల వరకు సేకరణ
ఔట్సోర్సింగ్ అధికారి ‘సదానందం’ పై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
‘డబ్బు’ ఇచ్చిన వారికే వేతనాల పెంపు? అంటూ ప్రచారం
బాగోతం బయటపెట్టిన వార్డు కౌన్సిలర్.. అయినా మౌనంగానే అధికారులు
‘ఎవరికైనా చెప్పుకో.. నాకేం కాదు’ అంటూ నిందితుడి బరితెగింపు
కాకతీయ, కరీంనగర్ : జమ్మికుంట మున్సిపాలిటీలో పాలన పట్టాలు తప్పడమే కాదు.. అవినీతికి అడ్డాగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ప్రజలకు సేవ చేయాల్సిన మున్సిపల్ కార్యాలయం, ఇప్పుడు ఉద్యోగుల రక్తాన్ని పిండే ‘వసూళ్ల కేంద్రం’గా మారిందని బాధితులు గొల్లుమంటున్నారు. వేతనాల పెంపు పేరిట సాగుతున్న ఈ చీకటి దందా ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం రేపుతోంది. మున్సిపాలిటీలో సానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి సదానందం ఇప్పుడు జమ్మికుంట మున్సిపాలిటీకి ‘అనధికార బాస్’గా చెలామణి అవుతున్నారనే చర్చ నడుస్తోంది. అధికారులతో తనకున్న సన్నిహిత సంబంధాలను సాకుగా చూపి, తోటి ఉద్యోగుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. “డబ్బులిస్తేనే జీతాలు పెరుగుతాయి.. లేదంటే మీ ఫైలు కదలదు” అంటూ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.

డ్రైవర్ల నుంచి రూ. 80వేల చొప్పున వసూళ్లు
మున్సిపాలిటీలో పనిచేస్తున్న వాహన చోదకులే (డ్రైవర్లు) ఈ దందాకు ప్రధాన బాధితులుగా మారారు. ఎనిమిది మంది డ్రైవర్ల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 80 వేల చొప్పున, మరో ఇద్దరి నుంచి రూ. 50 వేల చొప్పున.. ఇలా సుమారు రూ. 7.40 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అన్నింటికంటే దారుణమైన విషయం ఏమిటంటే.. సీనియార్టీ ప్రకారం ముందుగా అర్హత ఉన్న వారిని పక్కనపెట్టి, ఎవరైతే భారీగా ముడుపులు చెల్లించారో వారికే వేతనాల పెంపు వర్తింపజేసినట్లు తెలుస్తోంది.
ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంపై 7వ వార్డు కౌన్సిలర్ ఆరా తీయడంతో అసలు గుట్టు రట్టయింది. బాధితులు తమ ఆవేదనను వెళ్లగక్కడంతో ఈ దందా తీరు వెలుగులోకి వచ్చింది. “డబ్బులు ఇవ్వకపోతే జీతాల పెంపు ఉండదని మాపై ఒత్తిడి తెచ్చారు” అని ఉద్యోగులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు, పాలకవర్గం మాత్రం మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి వెనుక ఏ ‘రాజకీయ’ శక్తి ఉందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
విచారణ ఎప్పుడు?
“ఎవరికైనా చెప్పుకోండి.. నాకేమీ కాదు” అన్నట్లుగా సదానందం వ్యవహరిస్తున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వేతనాల పెంపులో జరిగిన ఈ అవకతవకలపై, లక్షల రూపాయల లావాదేవీలపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని బాధితులు కోరుతున్నారు. సమగ్ర విచారణ జరిపి, ఈ ‘పవర్ బ్రోకర్’ ఆగడాలకు చరమగీతం పాడాలని జమ్మికుంట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

