ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు
అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
కొనుగోలు కేంద్రం..రైస్ మిల్లుల్లో తనిఖీ
రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశం
కాకతీయ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పోత్తూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం, ఏఎంసీ గోదాము మరియు రాజరాజేశ్వర రైస్ మిల్లును అదనపు కలెక్టర్ (అడిషనల్ కలెక్టర్) గడ్డం నగేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు విధానం, నిల్వలు, రవాణా ప్రక్రియలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఏమాత్రం తాత్సారం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. గోదాములో నిల్వ ఉంచిన ధాన్యం నాణ్యతను పరిశీలించిన ఆయన, నిల్వల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రాజరాజేశ్వర రైస్ మిల్లును సందర్శించిన అదనపు కలెక్టర్.. అక్కడ జరుగుతున్న మిల్లింగ్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) గడువులోగా ప్రభుత్వానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని మిల్లు నిర్వాహకులను కోరారు. ధాన్యం రవాణాలో లారీల కొరత లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ సురేష్, వ్యవసాయ మరియు పౌరసరఫరా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

