ఈ నెల 20న మెడికల్ షాపుల బంద్
ఆన్లైన్ మందుల విక్రయాలను అరికట్టాలని డిమాండ్
ఇల్లంతకుంట తహసీల్దార్, పోలీసులకు వినతిపత్రం అందజేత
కాకతీయ, ఇల్లంతకుంట: ఆన్లైన్ ద్వారా సాగుతున్న మందుల విక్రయాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కెమిస్టుల సమ్మెకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల మెడికల్ షాపుల యజమానులు, కెమిస్టులు మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆదివారం వారు మండల కేంద్రంలో విస్తృత అవగాహన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సమ్మెకు సంబంధించిన వినతిపత్రాన్ని ఇల్లంతకుంట మండల తహసీల్దార్ సురేష్‌కు, పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా కెమిస్టుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆన్లైన్ ఫార్మసీల వల్ల చిన్న స్థాయి మెడికల్ షాపుల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్ల పేరుతో స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. ఆన్లైన్ విధానం వల్ల నకిలీ మందుల విక్రయాలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి ఈ విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 20న చేపట్టనున్న సమ్మెకు ప్రజలు సహకరించాలని, అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలపతి రెడ్డి, హరీష్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, నవీన్, రవీందర్ రెడ్డి, మహేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

