ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
పోలీసుల తనిఖీలకు భయపడి పొలాల వెంట ప్రయాణం
లైట్లు ఆఫ్ చేసి వెళ్లడంతో అదుపుతప్పిన వాహనం
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణా సోమవారం తెల్లవారుజామున ఒకరి ప్రాణాన్ని బలిగొంది. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో వేగంగా దూసుకెళ్లిన ఓ ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ నరేష్ గోపాలపూర్ జాతర బందోబస్తు ముగించుకుని సిబ్బందితో కలిసి బైపాస్ రోడ్డుపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రహదారిపై అనుమానాస్పదంగా వెళ్తున్న కొన్ని ఇసుక ట్రాక్టర్లను పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. పోలీసుల వాహనాన్ని గమనించిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ తనిఖీల నుంచి తప్పించుకోవడానికి వాహనాన్ని వేగంగా మళ్లించాడు. దుర్శేడు గ్రామ శివారులోకి రాగానే పోలీసులకు దొరకకూడదనే ఉద్దేశంతో ట్రాక్టర్ లైట్లు పూర్తిగా ఆర్పివేసి, చీకట్లోనే పొలాల గట్ల గుండా పోనిచ్చాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి అక్కడే ఉన్న ఓ పెద్ద బండరాయిని బలంగా ఢీకొట్టి బోల్తా పడింది.
హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతి
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ సీటులో నుంచి డ్రైవర్ తీవ్ర వేగంతో కిందకు ఎగిరిపడి తల, ఛాతి భాగాల్లో బలమైన గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు తక్షణమే స్పందించి తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే క్షతగాత్రుడు మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. నిబంధనలకు విరుద్ధంగా వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కరీంనగర్ నగర పరిసర ప్రాంతాల్లో మరియు గ్రామీణ రహదారులపై అర్ధరాత్రి, తెల్లవారుజామున ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు విపరీతంగా పెరిగాయని స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులకు దొరకవద్దనే కంగారులో డ్రైవర్లు ట్రాక్టర్లను అమిత వేగంతో నడుపుతున్నారని, దీనివల్ల రహదారులపై వెళ్లే సాధారణ ప్రయాణికులు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

