వృద్ధుల ఆశ్రమ భూమిని కాపాడాలి
లింగంపేటలో వృద్ధుల రిలే నిరాహార దీక్షలు
సబ్‌స్టేషన్ పేరుతో స్థలాన్ని లాక్కునే కుట్ర : చార్వాక ట్రస్ట్ ఆగ్రహం
కాకతీయ, వేములవాడ : చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో వృద్ధుల ఆశ్రమం కోసం కేటాయించిన భూమిని సబ్‌స్టేషన్ పేరుతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంపై చార్వాక ట్రస్ట్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అధికారులు వృద్ధుల ఆశ్రమాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఆశ్రమ భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వృద్ధులు రిలే నిరాహార దీక్షకు దిగారు. 2014లో అప్పటి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారని, అక్కడ ఆశ్రమ భవనం కూడా నిర్మించబడిందని ట్రస్ట్ సభ్యులు గుర్తు చేశారు. గ్రామంలో ఇతర ప్రత్యామ్నాయ స్థలాలు ఉన్నప్పటికీ, కావాలనే కొందరు అధికార పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ సేవా స్థలాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. మండుటెండలో దీక్షకు కూర్చున్న వృద్ధులు తమ చివరి ఆశ్రయాన్ని లాక్కుంటే ఎక్కడికి వెళ్లాలని కన్నీటి పర్యంతమయ్యారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
ప్రజా సేవ కోసం ఇచ్చిన భూమిని రాజకీయాల కోసం లాక్కోవాలని చూస్తే సహించేది లేదని ట్రస్ట్ సభ్యులు, గ్రామస్థులు హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వృద్ధుల ఆశ్రమ భూమిపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తున్న అధికారులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

