చొప్పదండిలో మట్టి మాఫియా దందా
చెరువులను అడ్డగోలుగా తవ్వేస్తున్న అధికార పార్టీ నేతలు
స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అండతోనే అక్రమాలు
వార్త కవరేజీకి వెళ్లిన విలేకరులపై బెదిరింపులా
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం
కాకతీయ, కరీంనగర్ /చొప్పదండి : చొప్పదండి నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోందని, అధికార పార్టీ నేతల అండదండలతో చెరువులను అడ్డగోలుగా తవ్వేస్తూ ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. గంగాధర మండలం కురిక్యాల చెరువును బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామడుగు, గంగాధర, చొప్పదండి, బోయినిపల్లి మండలాల్లోని చెరువులు, నీటి వనరులు మట్టి మాఫియా కారణంగా నాశనమవుతున్నాయని రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పారుదల, మైనింగ్ శాఖ అధికారుల ఉదాసీనత వల్లే ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోందని విమర్శించారు. అరకొర అనుమతులు చూపిస్తూ వందల లారీల్లో మట్టిని తరలిస్తూ కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు తెరలేపారని ధ్వజమెత్తారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రధాన అనుచరులే ఈ మాఫియా వెనుక ఉన్నారని, అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతుండటంతో కాంగ్రెస్ నాయకులే లారీలను అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.
విలేకరులను బెదిరిస్తే ఊరుకోం!
చెరువు వద్ద జరుగుతున్న అక్రమ తవ్వకాలను కవరేజ్ చేయడానికి వెళ్లిన విలేకరులను ఎమ్మెల్యే అనుచరులు చంపేస్తామంటూ బెదిరించడంపై రవిశంకర్ తీవ్రంగా మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. గ్రామాల ప్రజలు, రైతులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా యంత్రాంగం స్పందించకపోవడం దారుణమన్నారు. చెరువులను నాశనం చేస్తున్న మట్టి మాఫియాపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

