ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏడీఈ!
రూ.25 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
బిల్లుల మంజూరీకి కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేసిన రమణారెడ్డి
కాకతీయ,మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ ఆపరేషన్స్ ముద్దం రమణా రెడ్డి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. కాంట్రాక్ట్ బిల్లుల మంజూరీ కోసం ఆయన లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ విద్యుత్ శాఖ డివిజన్ పరిధిలో ఓ కాంట్రాక్టర్ కొన్ని పనులు చేపట్టారు. వీటికి సంబంధించిన రూ. 3,13,882 బిల్లుల మంజూరి ఫైలును ముందుకు కదిలించేందుకు ఏడీఈ రమణారెడ్డి రూ.25 వేలు లంచంగా ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఈ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో వ్యూహాత్మకంగా అడుగులు వేసిన ఏసీబీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నర్సాపూర్‌లోని కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి ఏడీఈ రమణారెడ్డి రూ. 25 వేల నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని కెమికల్ పరీక్షలు నిర్వహించారు. ఏడీఈపై కేసు నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టినట్లు అధికారులు వివరించారు.

