ఎండ తీవ్రతకు రోడ్డుపైనే తగలబడిన స్కూటీ
పాల్వంచకు చెందిన కుటుంబానికి తప్పిన పెను ప్రమాదం
కాకతీయ, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఎండ తీవ్రతకు ఓ స్కూటీ రోడ్డుపైనే పూర్తిగా అగ్ని ఆహుతైంది. మండల పరిధిలోని వినోబానగర్ గ్రామం వద్ద శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులు అప్రమత్తమవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు తమ స్కూటీపై ఖమ్మం నుంచి పాల్వంచకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో జూలూరుపాడు మండలం వినోబానగర్ సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ వద్దకు రాగానే, ఎండ తీవ్రతకు స్కూటీ ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్కూటీపై ఉన్న కుటుంబ సభ్యులు అప్రమత్తమై వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి కిందకు దిగిపోయారు. చూస్తుండగానే మంటలు వాహనంలోని పెట్రోల్ ట్యాంకుకు అంటుకోవడంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమీప పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు పరుగెత్తుకుంటూ వచ్చి నీళ్లు చల్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే స్కూటీ పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో వాహనంపై ఉన్న వారంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా కొత్తగూడెం – ఖమ్మం జాతీయ రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.


