దళిత ఉద్యోగులపై బెదిరింపులు ఆపాలి
అధికారులను భయపెట్టి తప్పు చేయించాలని చూస్తే ఊరుకోం
దళిత అధికారులకు అండగా ఉంటాం
దళిత సంఘాల జేఏసీ నాయకుడు సోంపల్లి తిరుపతి

కాకతీయ, పినపాక (మణుగూరు): పినపాక మండలంలో కొంతమంది రాజకీయ నాయకులు దళిత అధికారులపై, ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడటం సరికాదని దళిత సంఘాల జేఏసీ నాయకుడు సోంపల్లి తిరుపతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమకు అనుకూలంగా పనిచేస్తే జేజేలు కొట్టడం, నిబంధనల ప్రకారం వ్యతిరేకంగా పనిచేస్తే బెదిరింపులకు దిగడం వంటి చర్యలను దళిత సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. శుక్రవారం పినపాక మండలం సీతారాంపురం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సోంపల్లి తిరుపతి మాట్లాడుతూ.. దళిత అధికారులు ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని, కానీ వారిని భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యంగా తప్పులు చేయించాలని చూస్తే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. దళిత సమాజం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాల వల్ల, కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిందే తప్ప దొంగ దారిన వచ్చిన జీవోలతో కాదని విమర్శించారు. ఒక శాతం కూడా లేని వారు 10 శాతం లబ్ధి పొందుతుంటే ఆనందపడే కొందరు నాయకులు, దళితులు తమ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొంది విధి నిర్వహణ చేస్తుంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారని ప్రశ్నించారు. నిలకడగా, నిజాయితీగా పనిచేసే అధికారులందరికీ దళిత సంఘాలు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో దళిత సంఘం జిల్లా నాయకులు అలవాల వెంకటేశ్వర్లు, విద్యార్థి సంఘం నాయకులు కోడి రెక్కల సంతోష్, కొప్పుల జస్వంత్, దళిత సంఘం మండల నాయకులు కొప్పుల లక్ష్మణ్, సోంపల్లి సిసింద్రీ తదితరులు పాల్గొన్నారు.

