పాలీసెట్ ఫలితాలలో ‘శ్రీవిజ్ఞాన్ స్కూల్’ సంచలనం!
120 మార్కులకు గాను 116 మార్కులు సాధించిన వాసం కార్తీక్
రాష్ట్ర స్థాయిలో టాప్-5 మార్కుల ప్రతిభ.. 164వ ర్యాంక్ కైవసం
విద్యార్థిని ఘనంగా అభినందించిన స్కూల్ యాజమాన్యం
కాకతీయ, మణుగూరు రూరల్ : మణుగూరు విద్యారంగంలో ‘శ్రీవిజ్ఞాన్ స్కూల్’ మరోసారి తన విజయ జైత్రయాత్రను కొనసాగించింది. తాజాగా విడుదలైన 2026 తెలంగాణ పాలీసెట్ ఫలితాలలో ఈ పాఠశాలకు చెందిన విద్యార్థి వాసం కార్తీక్ 120 మార్కులకు గాను 116 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచాడు. మార్కుల విశ్లేషణ ప్రకారం రాష్ట్ర స్థాయిలో టాప్-5 మార్కుల ప్రతిభగా నిలిచిన కార్తీక్, ఓవర్ ఆల్గా రాష్ట్ర స్థాయిలో 164వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించాడు. ఈ అద్భుత ఫలితం మణుగూరు ప్రాంత ప్రజలను ఆనందోత్సాహాలకు గురిచేసింది. విద్యార్థి సాధించిన ఈ ఘనతపై పట్టణ ప్రజలు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు. వరుస విజయాలతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీవిజ్ఞాన్ స్కూల్.. పదవ తరగతి ఫలితాలలోనే కాకుండా, పోటీ పరీక్షలలోనూ ప్రతి ఏడాది సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తోంది. నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, ప్రత్యేక అకాడమిక్ ప్రణాళికలతో విద్యార్థులను రాష్ట్ర స్థాయి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని పాఠశాల యాజమాన్యం మరోసారి నిరూపించింది.
అంకితభావమే విజయాలకు బలం
ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండంట్ సప్పిడి సాంబశివరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కష్టపడే తత్వంతో పాటు, ఉపాధ్యాయుల అంకితభావం, తమపై తల్లిదండ్రులు ఉంచిన విశ్వాసమే ఈ విజయాలకు ప్రధాన బలం అని చెప్పారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన విజయాలు సాధించి మణుగూరు కీర్తి పతాకాన్ని రాష్ట్ర స్థాయిలో మరింత ఎత్తులో నిలబెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాలీసెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి వాసం కార్తీక్‌ను స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.

