దొంగలు బాబోయ్ దొంగలు
చేర్యాల సర్కిల్‌లో వరుస చోరీలతో జనం బెంబేలు
తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు
పగలు, రాత్రి తేడా లేకుండా రెచ్చిపోతున్న దొంగలు
పెరిగిన చైన్ స్నాచింగ్‌లు, ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం
రాత్రి గస్తీ నామమాత్రమేనంటూ జనాల నుంచి విమర్శలు
అలర్ట్‌గా ఉండాలంటున్న సీఐ రమేష్ నాయక్, ఎస్సై అపూర్వ రెడ్డి
కాకతీయ, చేర్యాల : చేర్యాల సర్కిల్ పరిధిలోని చేర్యాల, మద్దూర్, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల్లో దొంగలు నానాటికీ రెచ్చిపోతున్నారు. గత రెండు, మూడు నెలలుగా ఇక్కడ వరుస చోరీలు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. దొంగలు పక్కా ప్లాన్‌తో, రెక్కీ నిర్వహించి మరీ ఇళ్లను దోచుకెళ్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల నిఘా లోపం వల్లే దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు పెరుగుతున్నాయని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎక్కడైనా చోరీ జరిగినప్పుడు కేవలం రెండు, మూడు రోజుల పాటు రాత్రిళ్లు గస్తీ నిర్వహించి, ఆ తర్వాత పోలీసులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించాల్సిన కొందరు పోలీసులు.. కేవలం మూసివేయని హోటళ్లు, దుకాణాల వద్దే ఉంటూ కాలనీల వైపు రావడం లేదని ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఒకటి రెండు సార్లు పెట్రోలింగ్ పెంచితే చాలావరకు చోరీలు తగ్గుతాయని ప్రజలు కోరుతున్నారు. ఇళ్లనే కాకుండా వ్యవసాయ పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను సైతం దొంగలు వదలడం లేదు. వాటిని ధ్వంసం చేసి లోపల ఉండే రాగి తీగలను అపహరిస్తున్నారు. ఘటనలు జరిగిన తర్వాత పోలీసులు కేసులు కట్టడం, అరెస్టులు చేయడం వరకు బాగానే ఉన్నా.. అసలు దొంగతనాలు జరగకుండా ముందస్తు నిఘా పెట్టడంలో వైఫల్యం చెందారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ఇటీవల జరిగిన ప్రధాన చోరీలు ఇవే:
మార్చి 10 : చేర్యాల గాంధీ కూడలి వద్ద భాస్కర్ మొబైల్ షాపులో రూ. 40,400 విలువైన ఫోన్ల దొంగతనం (నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేశారు). మే 11: చేర్యాల గడితోట కాలనీకి చెందిన పిట్టల శ్రీనివాస్ ఇంట్లో పట్టపగలే 5 తులాల బంగారం, రూ. 50 వేల నగదు అపహరణ. మే 14: కొమురవెల్లి మండలం కిష్టంపేటలో లింగంపల్లి కరుణాకర్ ఇంట్లో తులంనర బంగారం, 20 తులాల వెండి, రూ. 25 వేల నగదు చోరీ. అదే రోజు అదే గ్రామానికి చెందిన లింగంపల్లి హరీష్ ఇంట్లో తులంనర బంగారం, రెండు ఖరీదైన చేతి వాచీలు మాయం. మే 23 (ఈరోజు): చేర్యాల పట్టణంలోని యంసాని కృష్ణమూర్తి ఇంట్లో రూ. 90 వేల నగదు, అలాగే స్థానిక శ్రీ మార్ట్‌లో రూ. 15 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.
వేసవిలో మరింత జాగ్రత్త అవసరం: సీఐ రమేష్ నాయక్
వేసవిలో ప్రజలు ఇళ్ల ఆవరణలో, డాబాలపై నిద్రిస్తున్న సమయంలో కాస్త అలర్ట్‌గా ఉండాలని చేర్యాల సీఐ బానోత్ రమేష్ నాయక్ కోరారు. శుభకార్యాలకు వెళ్లేటప్పుడు పొరుగువారికి చెప్పాలని, బంగారం, వెండి నగలను బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలని సూచించారు. గ్రామాల్లో కొత్తగా కనిపించే అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రి వేళల్లో యువత గస్తీ నిర్వహించుకునేలా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రయాణాలు ఉంటే పోలీసులకు చెప్పండి : ఎస్సై అపూర్వ రెడ్డి
వరుస చోరీల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి సూచించారు. కుటుంబంతో కలిసి ఊరు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలన్నారు. వీలైతే ‘పోలీస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్’ సేవలను వాడుకోవాలని కోరారు. ఇంట్లో ఎక్కువ నగదు, విలువైన ఆభరణాలు ఉంచకూడదని, కాలనీల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల కోసం పోలీస్ నంబర్లు: +91 87126 67356, 871-266-7355 లేదా డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

