కుటుంబాన్ని వెంటాడిన దురదృష్టం
కుమారుడు మృతి, కోమాలో తల్లిదండ్రులు!
వైద్యం కోసం వెళ్తుండగా సారపాక సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
తీవ్ర గాయాలతో భద్రాచలం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో దంపతులు
ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన కుమారుడు మనోహర్
ఒకే కుటుంబం రోడ్డున పడటంతో కరకగూడెంలో అలుముకున్న విషాద ఛాయలు
కాకతీయ, కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరుస ప్రమాదాల బారిన పడటంతో ఆ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. విధి వంచించిన ఈ ఘోర ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా, తల్లిదండ్రులు చావుబతుకుల మధ్య కోమాలో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం గ్రామానికి చెందిన ఆడెపు సతీష్ అనే వ్యక్తి గతంలో జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఆ గాయాలకు మెరుగైన వైద్యం చేయించుకోవడం కోసం సతీష్ తన భార్య, కుమారుడు మనోహర్‌తో కలిసి శనివారం ఆటోలో భద్రాచలం ఆసుపత్రికి బయలుదేరాడు. అయితే, వారిని దురదృష్టం రోడ్డు రూపంలో వెంటాడింది. ఆటో సారపాక సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన మరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికీ తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు.
కొడుకు చనిపోయిన సంగతి కూడా తెలియని స్థితిలో..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి ముగ్గురినీ చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సతీష్, అతని భార్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ప్రస్తుతం వారు కోమాలోకి వెళ్లారు. కాగా, తీవ్రంగా గాయపడిన కుమారుడు మనోహర్‌ను మెరుగైన చికిత్స కోసం అత్యవసరంగా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి చిన్నారి మనోహర్ కన్నుమూశాడు. కంటిపాపలా చూసుకోవాల్సిన కుమారుడు అనంతలోకాలకు వెళ్లాడనే చేదు నిజం కూడా ప్రస్తుతం కోమాలో ఉన్న ఆ దురదృష్టకర తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి నెలకొంది.
గ్రామంలో మిన్నంటిన రోదనలు
వైద్యం కోసం వెళ్తూ ఒకే కుటుంబం అంతా ప్రమాదాల బారిన పడటం, చిన్నారి మనోహర్ మరణించడంతో కరకగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకప్పుడు నవ్వుతూ సాగిన ఆ ఇల్లు నేడు నిశ్శబ్దంగా మారిపోయింది. బాధితుల బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దేవుడు ఇంతటి ఘోర అన్యాయం చేయాల్సింది కాదంటూ గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోమాలో ఉన్న సతీష్ దంపతులు త్వరగా కోలుకోవాలని, ప్రభుత్వం ఈ పేద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు.

