ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన
ఆటోను తాడుతో లాగుతూ ఇందిరా చౌక్ వద్ద ఆందోళన
నెల రోజుల్లో నాలుగు సార్లు పెంచడం అన్యాయం
: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కాకతీయ, కరీంనగర్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా చౌక్ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. ఆటో రిక్షాకు తాడు కట్టి రోడ్డుపై లాగుతూ కేంద్ర ప్రభుత్వ ఇంధన విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నెల రోజుల్లోనే నాలుగు సార్లు ఇంధన ధరలను పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపిందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల కారణంగానే దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు.
రూపాయి విలువ పతనం వల్లే
గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ.. సామాన్యులపై భారం పడకుండా ఇంధన ధరలను అదుపులో ఉంచామని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ సవాళ్లకు తోడు రూపాయి విలువ పడిపోవడం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఇంధన ధరలు అదుపులేకుండా పెరుగుతున్నాయని ఆరోపించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, పార్టీ నాయకులు ఫహద్, పంజాల కృపాసాగర్, ఉప్పరి విశాల్, వరాల నరసింగం, పడాల శ్రీజ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

