వేములవాడలో హిమాన్షు రావు పూజలు
భీమేశ్వర స్వామిని దర్శించుకున్న కేటీఆర్ తనయుడు
వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ అర్చకుల ఘన స్వాగతం
తీర్థప్రసాదాలు అందజేసిన ఈఓ రమాదేవి
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు సోమవారం పర్యటించారు. తన స్నేహితులతో కలిసి వచ్చిన ఆయన.. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న హిమాన్షు రావుకు అర్చకులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి జరిగిన ప్రత్యేక అభిషేకాలు, అర్చనల పూజా కార్యక్రమాల్లో హిమాన్షు రావు పాల్గొన్నారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు ఆయనకు వేదోక్త ఆశీర్వచనం అందించగా.. ఆలయ ఈఓ రమాదేవి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వేములవాడ క్షేత్ర విశిష్టత, ఆలయ సంప్రదాయాలను హిమాన్షు రావు అడిగి తెలుసుకున్నారు. హిమాన్షు రావు పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏనుగు మనోహర్ రెడ్డి, గూడూరి మధు, ఏనుగు తిరుపతి రెడ్డి, నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, జోగిని శంకర్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


