పారిశుధ్య కార్మికురాలిపై అధికారి వేధింపులు..?
ఇంటి పనులు చేయాలంటూ అదనపు కమిషనర్ ఒత్తిడి?
పీఎస్‌లో విచారణ పేరిట వేధింపులపై బాధితురాలి ఆవేదన
అదనపు కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని కార్మిక సంఘాల ధర్నా
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ (మున్సిపల్ కార్పొరేషన్)లో పనిచేస్తున్న ఒక మహిళా పారిశుధ్య కార్మికురాలిపై ఉన్నతాధికారి వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు నగరంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కార్పొరేషన్ అదనపు కమిషనర్ సువార్త తన నివాసంలో ఇంటి పనులు చేయాలంటూ ఒత్తిడి తెచ్చారని, దానికి నిరాకరించినందుకు పారిశుధ్య కార్మికురాలు రేవెని లక్ష్మిపై దురుసుగా ప్రవర్తించారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాధితురాలు లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. అదనపు కమిషనర్ ఇంట్లో బంగారు గొలుసు పోయిందనే నెపంతో, కేవలం అనుమానంతో తనను కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ విచారణ పేరుతో తనను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశారని, అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో తనపై దాడి కూడా జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో (సోషల్ మీడియా) వైరల్ కావడంతో ఈ వ్యవహారంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
కార్మిక సంఘాల ఆగ్రహం..
ఈ దారుణ ఉదంతంపై పారిశుధ్య కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు సోమవారం కరీంనగర్లో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాధితురాలికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మహిళా కార్మికులను గౌరవించి, రక్షించాల్సిన అధికారులే ఇలాంటి వేధింపులకు పాల్పడటం దురదృష్టకరమని వామపక్ష నాయకులు మండిపడ్డారు. అదనపు కమిషనర్‌ను వెంటనే విధుల్లోంచి సస్పెండ్ చేసి, ఈ ఘటనపై ఉన్నతాధికారులతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

