కాకతీయ ఎఫెక్ట్
చిట్టీల దందాపై పోలీసుల తనిఖీలు
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు
అనుమతులు లేని ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాలపై 6 కేసులు నమోదు
రూ.1.39 కోట్ల విలువైన పత్రాలు, నగలు స్వాధీనం
అనుమతుల్లేకుండానే ఫైనాన్స్ వ్యాపారం నేరం
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగుతున్న అక్రమ వడ్డీ వ్యాపారం, మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులు, చట్టవిరుద్ధ చిట్ ఫండ్ వ్యవహారాలపై ‘కాకతీయ’ దినపత్రికలో ప్రచురితమైన “సిరిసిల్లలో చిట్టీల చీకటి దందా” కథనానికి పోలీస్ శాఖ నుంచి తక్షణ స్పందన లభించింది. కథనంలో వెలుగులోకి వచ్చిన అధిక వడ్డీలు, ప్రజలపై ఒత్తిళ్లు, అక్రమ ఫైనాన్స్ దౌర్జన్యాలపై పోలీసులు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు 15 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు మంగళవారం ఉదయం జిల్లా అంతటా ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తూ, అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను వేధిస్తున్న వారిపై 6 కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో రూ.1.39 కోట్ల విలువైన వివిధ రకాల ప్రామిసరీ నోట్లు, బాండ్ పత్రాలు, డైరీలు, అలాగే రూ.1.77 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ హెచ్చరిక
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని, చట్టవిరుద్ధంగా డబ్బులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేసే వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితుల్లో అవసరాలకు మించి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని, ఆ తర్వాత వాటిని చెల్లించలేక కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టవద్దని సూచించారు. ప్రభుత్వ అనుమతితో చట్టబద్ధంగా నడిచే ఫైనాన్స్ సంస్థలనే నమ్మాలని, ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఫైనాన్స్ వ్యాపారం నడిపేవారి వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయానికి గానీ, స్థానిక పోలీసులకు గానీ తెలియజేయాలని ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.


