చేయించుకున్న పనికి బిల్లులివ్వండి
ఎంపీడీవో ఆఫీసు ఎదుట ట్రాక్టర్ యజమాని ఆందోళన!
బిల్లులివ్వకుంటే నాకు చావే శరణ్యమంటూ ఆవేదన
పురుగుల మందు డబ్బాతో కార్యాలయం ఎదుట బైఠాయింపు
ఏడాది దాటినా రాని ఉపాధి హామీ నిధులు.. అప్పుల భారంతో వేదన
నిధులు రాగానే చెల్లిస్తామని ఏపీవో రాజయ్య వివరణ
కాకతీయ, చందుర్తి : చేయించుకున్న పనులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ ట్రాక్టర్ యజమాని పురుగుల మందు డబ్బాతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు. చందుర్తి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన లాండే సంతోష్ అనే ట్రాక్టర్ యజమాని 2025లో ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ రోడ్ల మరమ్మతుల కోసం సుమారు 200 ట్రిప్పుల మట్టిని తన ట్రాక్టర్ ద్వారా తరలించాడు. అప్పట్లో బిల్లులు కొంచెం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నమ్మి పనులు పూర్తి చేశాడు. అయితే పనులు ముగిసి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని సంతోష్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తిప్పలు పెడుతున్నారు.. అప్పుల పాలయ్యా : బాధితుడు
మొదట్లో పనులు చేయించుకోవడానికి పెద్దపెద్ద హామీలు ఇచ్చిన అధికారులు.. ఇప్పుడు మాత్రం పనులకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాలని చెబుతూ కాలయాపన చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. సమయానికి బిల్లులు రాకపోవడంతో ట్రాక్టర్ వాయిదాలు కట్టలేక, అప్పుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయాడు. న్యాయం కోసం ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతోనే, చివరకు ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధపడి పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగాల్సి వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ ఘటనతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. స్థానికులు, కార్యాలయ సిబ్బంది ఆయనను సముదాయించే ప్రయత్నం చేశారు.

నిధులు రాగానే ఇస్తాం : ఏపీవో
ఈ విషయమై ఏపీవో రాజయ్యను వివరణ కోరగా.. సంతోష్ చేసిన పనులకు సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ (పేమెంట్ ప్రాసెస్) పూర్తయిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే సదరు బిల్లులను పూర్తిగా చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు.

