మా బతుకులకు భరోసా లేదా?
గ్రామాల అభివృద్ధికి మా శ్రమే ఆధారం
చందుర్తిలో ఉధృతంగా వీఓఏల నిరవధిక సమ్మె
డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక
స్తంభించిన మహిళా సంఘాల లావాదేవీలు.. మద్దతుగా నిలిచిన గ్రామాలు
కాకతీయ, చందుర్తి : “గ్రామాల అభివృద్ధికి మా శ్రమే ఆధారం.. మా బతుకులకు మాత్రం భరోసా లేదా?” అంటూ చందుర్తి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం వద్ద వీఓఏలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం మరింత ఉధృతరూపం దాల్చింది. “ఏళ్ల తరబడి గ్రామాల్లో వెట్టిచాకిరీ చేయించుకుని.. ఇప్పుడు చేతులు దులుపుకోవడం దారుణం” అంటూ ప్రభుత్వంపై వీఓఏలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు పునాది వేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చుతున్న తమను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. మహిళా సంఘాల ఏర్పాటు నుంచి బ్యాంకు రుణాల అనుసంధానం, పొదుపు సంఘాల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు వరకు ప్రతి బాధ్యత తమ భుజాలపైనే ఉన్నప్పటికీ.. కనీస ఉద్యోగ భద్రత కూడా కల్పించకపోవడం అన్యాయమని పలువురు వీఓఏలు కన్నీటి పర్యంతమయ్యారు. పెరుగుతున్న ధరల భారం మధ్య అరకొర వేతనాలతో కుటుంబాలను పోషించడం అసాధ్యంగా మారిందని వాపోయారు.
వీఓఏలకు కనీస వేతనం రూ.20,000 వెంటనే అమలు చేయాలి. సెర్ఫ్ ఉద్యోగులుగా అధికారిక గుర్తింపు ఇచ్చి హెచ్ఆర్ పాలసీ వర్తింపచేయాలి. అర్హులైన వీఓఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలి.
జీవో నెం.58ను సవరించి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రతి వీఓఏకు రూ.20 లక్షల ఆరోగ్య బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు.“మా డిమాండ్లు నెరవేర్చే వరకు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం.. పోరాటం మరింత ఉధృతం చేస్తాం” అంటూ వీఓఏలు ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. వీఓఏల సమ్మెతో గ్రామస్థాయిలో మహిళా సంఘాల లావాదేవీలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా స్తంభించే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరిపి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని వీఓఏలు డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు మండలంలోని మహిళా సంఘాలు, గ్రామస్థాయి ప్రజలు, పలు సామాజిక సంస్థలు భారీగా మద్దతు తెలపడంతో ఉద్యమం మరింత వేడెక్కింది. ఈ సందర్భంగా పలు

