నేటి యువత నెహ్రూ అడుగుజాడల్లో నడవాలి
కాకతీయ, చేర్యాల : నేటి యువత, విద్యార్థులు నవభారత నిర్మాత, దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అడుగుజాడల్లో నడవాలని కాంగ్రెస్ పార్టీ చేర్యాల పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా బుధవారం చేర్యాల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి శ్రీకాంత్ మాట్లాడుతూ.. 17 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా సేవలందించిన నెహ్రూ, భారతదేశంలో ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద విలువల పరిరక్షణ కోసం ఎంతో కృషి చేశారన్నారు. పంచశీల ప్రబోధకుడిగా, అలీనోద్యమ పితామహుడిగా, పంచవర్ష ప్రణాళికల ప్రాణదాతగా దేశ చరిత్రలో ఆయన నిలిచిపోయారన్నారు. నవభారతావనికి శాస్త్రీయ దృక్పథాన్ని కల్పిస్తూ శాస్త్ర, సాంకేతిక రంగాల ప్రగతికి నెహ్రూ బలమైన పునాదులు వేశారని కొనియాడారు. దేశంలోని భారీ సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిన దార్శనికుడు నెహ్రూ అని శ్లాఘించారు. భారత ప్రజాస్వామ్య సౌధానికి పునాది వేసిన నెహ్రూ సేవలు ఎప్పటికీ మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ ఆడెపు చంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంజె మల్లేశం, నాయకులు కాటం సంజీవులు, పోతుగంటి ప్రసాద్, కాటం మల్లేశం, కాశెట్టి ఉపేందర్, పచ్చిమడ్ల సతీష్ గౌడ్, తడాకా లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

