ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా ప్రభుత్వం
రెండో విడతలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
మహిళల ఆర్థిక ఎదుగుదలకు వడ్డీ లేని రుణాలు
మంగపేటలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రజా ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మంగపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ప్రభుత్వం ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పెళ్లిళ్ల సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇదే తరుణంలో సమాజానికి హానికరమైన బాల్య వివాహాలను పూర్తిగా నిరోధించాలని, చట్టబద్ధమైన వయస్సు వచ్చిన తర్వాతే వివాహాలు చేయాలని సూచించారు. బాలికల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. అలాగే నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు అర్హులైన లబ్ధిదారులందరికీ రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, మంగపేట తహసీల్దార్ తోట రవీందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

