తెలుగువారి ఖ్యాతిని చాటిన ధీశాలి ఎన్టీఆర్
రూ. 2 కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు చారిత్రాత్మకం
ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
కాకతీయ, కొత్తగూడెం: సినిమా, రాజకీయ రంగాల్లో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ధీశాలి నందమూరి తారకరామారావు అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను గురువారం పాతకొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాబీర్ పాషా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2 కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి పథకాలు పేదల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, రామారావు, భవాని ప్రసాద్, మల్లేష్ పాల్గొన్నారు.

