వరి అవశేషాలకు నిప్పు
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలో విషాదం
కాకతీయ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలో గురువారం ఒక ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో వరి అవశేషాలను (కోయలను) తగులబెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని ఎల్లక నారాయణ (60) అనే వృద్ధ రైతు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. రైతు నారాయణ తన పొలంలో వరి కోతలు పూర్తయిన తర్వాత మిగిలిన అవశేషాలకు నిప్పు పెట్టాడు. అయితే ఎండ తీవ్రత, గాలి ప్రభావంతో ఒక్కసారిగా మంటలు వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే పొలమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో, నారాయణ బయటకు రాలేకపోయాడు. పొగ కారణంగా ఊపిరాడక ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన పక్క పొలాల రైతులు, గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ.. అప్పటికే ఆయన మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఇల్లంతకుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కళ్లెదుటే రైతు మరణించడంతో తాళ్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

