‘మోడీ’ చేతిలో కీలుబొమ్మగా ఈడీ
కేరళ మాజీ సీఎంపై దాడులు రాజకీయ కక్షసాధింపే
సీపీఎం సీనియర్ నాయకుడు రవికుమార్ ధ్వజం
కాకతీయ, దుమ్ముగూడెం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై కక్షసాధింపునకు దిగుతోందని సీపీఎం సీనియర్ నాయకుడు రవికుమార్ ధ్వజమెత్తారు. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పూర్తిగా మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఈడీ జరిపిన దాడులకు నిరసనగా శుక్రవారం దుమ్ముగూడెం మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి ఈడీ దాడులతో, రాజకీయ బెదిరింపులతో సీపీఎం నాయకత్వాన్ని బలహీనపరచలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు వంశీకృష్ణ, చంద్రయ్య, చిలకమ్మ, కోటేశ్వరరావు, శ్రీను, బాబు, రాజమ్మ, సమ్మక్క, చంటి, సాయిరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వీరభద్రం పాల్గొన్నారు.

