రూ.250 చెల్లిస్తే.. రూ.50 వేల బీమా!
ప్రతి ఇంటికీ ఒక గేదెను పెంచుకోవాలి
పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే లక్ష్యంగా వినూత్న పథకాలు
కరీంనగర్ డెయిరీ చైర్మన్ చెలిమెడ రాజేశ్వర్ రావు
27 మంది లబ్ధిదారులకు రూ.13.50 లక్షల పాడి రైతు భరోసా చెక్కుల పంపిణీ
కాకతీయ, చిగురుమామిడి : పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే లక్ష్యంగా కరీంనగర్ డెయిరీ ‘పాడి రైతు భరోసా’ బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని, ప్రతి రైతు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను పెంపొందించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చెలిమెడ రాజేశ్వర్ రావు కోరారు. హుస్నాబాద్ లో కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో సోమవారం హుస్నాబాద్ చిల్లింగ్ సెంటర్ పరిధిలోని 27 మంది లబ్ధిదారులకు రూ.13 లక్షల 50 వేల విలువ గల పాడి రైతు భరోసా చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. పాల ఉత్పత్తిదారుడు సంవత్సరానికి కేవలం రూ.250 చెల్లిస్తే, ఒకవేళ భార్య గాని భర్త గాని మరణిస్తే ఆ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని కరీంనగర్ డెయిరీ తరఫున అందజేస్తామని చెప్పారు. మరణం ఎవరికీ చెప్పి రాదని, అందువల్ల ప్రతి పాల ఉత్పత్తిదారుడు తప్పనిసరిగా రూ.250 చెల్లించి ఈ భరోసా పథకంలో చేరాలని పిలుపునిచ్చారు.
లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ
దీంతో పాటు 9, 10వ తరగతి చదువుతున్న పాడి రైతుల పిల్లలకు ఈ పథకంలో భాగంగా రూ.800 చొప్పున స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నట్లు చైర్మన్ రాజేశ్వర్ రావు వెల్లడించారు. పాల ఉత్పత్తిదారుల శ్రేయస్సు కోసం అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ కరీంనగర్ డెయిరీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. కరీంనగర్ డెయిరీ అనేది ఏ ఒక్కరి సొంతమో కాదని, ఇది లక్ష పాడి రైతు కుటుంబాల ఉమ్మడి సంస్థ అని స్పష్టం చేశారు. డెయిరీ పరిధిలో ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరిగితే నిలదీసి ప్రశ్నించే పూర్తి స్వేచ్ఛ ఒక్క కరీంనగర్ డెయిరీలో మాత్రమే రైతులకు ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డెయిరీ బోర్డు డైరెక్టర్లు అంతం నారాయణరెడ్డి, కన్నబోయిన రవీందర్, మేనేజర్లు కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చింతపూల నాగయ్య, అసిస్టెంట్ మేనేజర్ సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, సూపర్‌వైజర్లు సిర్రా కరుణాకర్ రెడ్డి, సీతా రవి, భాస్కర్ రెడ్డి, వీరస్వామి, అప్పాల మల్లయ్య, హుస్నాబాద్ పాలకేంద్రం అధ్యక్షుడు కాయిత బాల్ రెడ్డి, సుందరగిరి అధ్యక్షుడు పిట్టల తిరుపతి, రామంచ అధ్యక్షుడు కూతురు మల్లారెడ్డి, ఆంజనేయులు, వెంకటస్వామి మరియు పాల ఉత్పత్తిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

