సీతారామస్వామిని దర్శించుకున్న నటుడు నరసింహారావు
గాలిగోపుర నిర్మాణానికి రూ.10 వేల విరాళం
అనాథ వృద్ధుల శరణాలయం సందర్శన
కాకతీయ, గంభీరావుపేట : సీనియర్ సినీ నటుడు, దర్శకుడు, న్యాయవాది సివిల్ నరసింహారావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గంభీరావుపేట మండల కేంద్రంలోని సీతారామాలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ.. భద్రాద్రి రామాలయం కంటే సుమారు 300 ఏళ్ల ముందే నిర్మితమైన ఈ చారిత్రాత్మక ఆలయాన్ని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. గత ఏడు శతాబ్దాలుగా ఇక్కడ నిరంతరాయంగా వెలుగుతున్న అఖండ జ్యోతిని దర్శించి పులకించిపోయానని చెప్పారు. ఈ అఖండ జ్యోతిని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజల చొరవను ఆయన అభినందించారు. ఆలయ గాలిగోపుర నిర్మాణానికి తన వంతుగా రూ.10 వేల నగదు విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక “మా” అనాథ వృద్ధుల శరణాలయాన్ని సందర్శించి, అక్కడి వృద్ధులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్, కోశాధికారి కిషన్, ప్రధాన అర్చకులు వేణుచారి పాల్గొన్నారు.

