రుద్రంగిలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
కేకులు కట్ చేసి మిఠాయిలు పంచిన నేతలు
కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి, కేకులు కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తూ కేసీఆర్ అహింసా మార్గంలో ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించి, చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించారని కొనియాడారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితమే నేటి స్వరాష్ట్రమన్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కోట్లాది ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని, అమరవీరుల త్యాగాల ఫలంగానే తెలంగాణ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

