రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు
సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా అడుగులు
మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీలో భారీ చీలికకు కుట్ర?
విలాసవంతమైన జీవనశైలితో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరణ
ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి ప్రతిపక్ష నేత స్థాయికి ప్రస్థానం
కాకతీయ, నేషనల్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 46 ఏళ్ల రితాబ్రతా బెనర్జీ ఒక నాటకీయ రాజకీయ సాహసికుడిగా చరిత్రలో నిలిచిపోనున్నారు. సిద్ధాంతాల మేలిముసుగులను పక్కనపెట్టి సీపీఎం నుంచి తృణమూల్ కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ మద్దతుతో ఆ పార్టీలోనే చీలిక తెచ్చే స్థాయికి ఆయన ప్రస్థానం సాగింది. బెంగాల్ రాజకీయ చరిత్రలో ఆయన చివరికి నవాబ్ సిరాజ్-ఉద్-దౌలాగా మిగులుతారా లేక మీర్ జాఫర్‌గా ముద్ర వేయించుకుంటారా అనేది కాలమే నిర్ణయించనుంది. కోల్‌కతా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన రితాబ్రతా, తన వాగ్ధాటితో అతిచిన్న వయసులోనే అగ్రనేతల గుర్తింపు పొందారు.
సీపీఎం నుంచి బహిష్కరణ
సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన రితాబ్రతా బెనర్జీ, మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు అత్యంత నమ్మకస్తుడిగా మారారు. పార్టీలో అనేక అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ, 2014లో కేవలం 35 ఏళ్ల వయసులోనే సీపీఎం తరఫున రాజ్యసభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా యాపిల్ వాచ్, మోంట్ బ్లాంక్ పెన్నులు వాడుతూ విలాసవంతమైన జీవనశైలిని గడపడం పార్టీలో చర్చనీయాంశమైంది. క్రమశిక్షణా రాహిత్యం, ముఠా రాజకీయాలు, బహిరంగ విమర్శల కారణంగా 2017లో సీపీఎం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.
దీదీ పంచన చేరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు
పార్టీ నుంచి బయటకు వచ్చాక కొంతకాలం బీజేపీ నేతలు ముకుల్ రాయ్, కైలాష్ విజయవర్గీయలతో సన్నిహితంగా తిరిగిన రితాబ్రతా, ఒక మహిళా కేసు వ్యవహారం తర్వాత రూట్ మార్చారు. మమతా బెనర్జీ సంక్షేమ పథకాలను వ్లాదిమిర్ లెనిన్ సిద్ధాంతాలతో పోలుస్తూ టీఎంసీకి దగ్గరయ్యారు. మమత, అభిషేక్ బెనర్జీల నమ్మకాన్ని గెలుచుకుని 2020లో తృణమూల్‌లో చేరి, ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ బాధ్యతలు చేపట్టడమే కాకుండా మరోసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత ఈ ఏడాది ఉలుబెరియా పూర్బా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి, మే 4, 2026 న తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మమతపై దాడి చేసిన చేతులతోనే.. ఇప్పుడు టీఎంసీపై తిరుగుబాటు!
గత 2013లో కోల్‌కతాలో విద్యార్థి నాయకుడి లాకప్ డెత్‌కు నిరసనగా ఢిల్లీ ప్లానింగ్ కమిషన్ గేట్ల వద్ద అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాలపై జరిగిన భౌతిక దాడిలో రితాబ్రతా బెనర్జీ ప్రధాన నిందితుడిగా ఉండి ఢిల్లీ పోలీసుల చేతిలో అరెస్టయ్యారు. అలాంటి నేతను టీఎంసీ అక్కున చేర్చుకుని ఎమ్మెల్యేని చేస్తే, ఇప్పుడు అదే పార్టీకి సమాధి కట్టేందుకు ఆయన సిద్ధమవడం గమనార్హం. ప్రస్తుతం బీజేపీ నేత సువేందు అధికారికి అత్యంత సన్నిహితంగా మారిన రితాబ్రతా, తృణమూల్ కాంగ్రెస్‌లో భారీ చీలిక తెచ్చి బీజేపీ స్పీకర్ మద్దతుతో బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అవతరించేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. కేవలం రాజకీయ చమత్కారాలు, వ్యూహాలతోనే కాకుండా ప్రజల్లో తన పట్టును నిరూపించుకుంటేనే ఆయన భవిష్యత్తు రాజకీయాల్లో మనుగడ సాగించగలరని విశ్లేషకులు భావిస్తున్నారు.

