పురుగుమందులు, ఎరువుల దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు
రంగాపూరంలో పెస్టిసైడ్స్ దుకాణంలో అక్రమ నిల్వలు గుర్తింపు
రూ.2.24 లక్షల విలువైన నిషేధిత స్టాక్ స్వాధీనం
దుకాణ యజమాని గొనే రాంబాబు అరెస్ట్
రైతుల ప్రాణాలు, పంటల భద్రతకు ముప్పు కలిగిస్తే సహించేది లేదు
టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ బండారి రాజు
కాకతీయ, వరంగల్ బ్యూరో : గడువు ముగిసిన వ్యవసాయ పురుగుమందులు, ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నల్లబెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగాపూర్ గ్రామంలో దాడులు నిర్వహించారు. రంగాపూర్‌లో ఉన్న ఎం/ఎస్ విజయదుర్గ పెస్టిసైడ్స్ దుకాణంపై చేపట్టిన తనిఖీల్లో గడువు ముగిసిన పురుగుమందులు, ఎరువులను విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు గుర్తించారు. దుకాణ యజమాని గొనే రాంబాబును అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి వివిధ రకాల గడువు ముగిసిన పురుగుమందులు, ఎరువులను స్వాధీనం చేసుకున్నారు.
భారీగా స్టాక్ స్వాధీనం
ఈ దాడిలో జిప్పీ గోల్డ్, కాలిన్ డ్రిప్, అజాహిట్, స్కూబా, విన్నర్ ఎం-45, మార్కెట్ ఎం-45, ఎస్‌ఏ గ్రోవిట్-80, అరిథ్రి డబ్ల్యూపీ, క్వింగెల్, వార్డెన్ ఎక్స్‌ట్రా, నాట్‌జ్యువెల్ ఎఫ్‌ఎస్, గోల్డెన్ మార్క్, స్టార్‌మైట్, ఈకోమాక్స్ ప్లస్ తదితర గడువు ముగిసిన ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పురుగుమందులు, ఎరువుల మొత్తం విలువ సుమారు రూపాయలు 2,24,982 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అనంతరం నిందితుడిని, స్వాధీనం చేసిన స్టాక్‌ను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
కఠిన చర్యలు తప్పవు
వ్యవసాయ రంగంలో రైతుల ప్రాణాలు, పంటల భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి గడువు ముగిసిన పురుగుమందులు, ఎరువుల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడిలో ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. బానుప్రకాశ్తో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

