శాత్రాజుపల్లి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు
వెయ్యి క్యూబిక్ మీటర్ల అనుమతి.. 10వేల క్యూబిక్ మీటర్ల తరలింపు
మూడు ఎక్స్కవేటర్లు, 50 టిప్పర్లతో కాంట్రాక్టర్ల అడ్డగోలు దోపిడీ
తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్‌కు గ్రామస్థుల ఫిర్యాదు
కాకతీయ, వేములవాడ : వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి గ్రామ చెరువులో అనుమతికి మించి అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు, రైతులు జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా మైనింగ్ అధికారికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. చెరువు నుండి మట్టి తరలింపును వెంటనే నిలిపివేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, శాత్రాజుపల్లి చెరువు నుంచి కేవలం 1000 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తరలించేందుకు జగిత్యాలకు చెందిన కాంట్రాక్టర్లు కావటి గంగధర్, బొడ్డుపెల్లి జగన్రాజుకు అనుమతి లభించిందన్నారు. అయితే గత ఐదు రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా మూడు పోక్లెయిన్లు, సుమారు 50 టిప్పర్ల సహాయంతో పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని చెరువు నుంచి తరలించారని, ఇంకా తవ్వకాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
అడ్డగోలు తవ్వకాల వల్ల చెరువులోని నల్లమట్టి పూర్తిగా తొలగిపోయి భవిష్యత్తులో రైతులకు అవసరమైన మట్టి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులను ఉల్లంఘించి మట్టి తరలింపునకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడిసె సదానందం, మాజీ ఉపసర్పంచులు రేగుల రాజేశం, నల్ల సతీష్ రెడ్డి, మ్యాకల శ్రీనివాస్, గుడిసె అనిల్ పాల్గొన్నారు.

