డివైడర్ల మధ్యలో మొక్కలు నాటండి
కలెక్టర్ గరిమ అగ్రవాల్
కలెక్టరేట్ జంక్షన్ సుందరీకరణ పనుల పరిశీలన
వస్త్ర ఉత్పత్తి విగ్రహాల ఏర్పాటుపై అధికారులకు అభినందనలు
పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం
కాకతీయ సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం జంక్షన్ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్యలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న జంక్షన్ సుందరీకరణ, గ్రీనరీ పనులతో పాటు వస్త్ర పరిశ్రమలో వస్త్ర ఉత్పత్తికి సంబంధించిన వివిధ దశల విగ్రహాల ఏర్పాటును శుక్రవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నేత కార్మికుల శ్రమను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన విగ్రహాలను చూసి అధికారులను అభినందించారు. జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి మరింత అందంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. మిగిలిపోయిన సుందరీకరణ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, డీఈ వాణి తదితరులు పాల్గొన్నారు.


