పశువుల రవాణాపై పోలీసుల మెరుపుదాడి
పశువులను రక్షించిన ఏటూరునాగారం పోలీసులు
వాహనం స్వాధీనం.. నిందితుడి అరెస్టు
ఏటూరునాగారం ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో చర్యలు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకుని, పశువులను రక్షించారు. అనుమానాస్పదంగా వెళ్తున్న బొలెరో వాహనం (TS 03 UD 1632)ను ఏటూరునాగారం పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాహనంలో గోవులను అమానుషంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో సంబంధిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పశువుల సంక్షేమానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అక్రమ గోవుల రవాణాను అడ్డుకుని, పశువులను రక్షించిన ఏటూరునాగారం ఎస్ఐ మహేష్‌ను స్థానికులు అభినందించారు. గో మాఫియాపై కఠిన చర్యలు కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

