గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే గండ్ర
కాకతీయ, భూపాలపల్లి : గ్రామీణ క్రీడలకు, క్రీడాకారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ‘ఖేలో ఇండియా’ పథకం కింద మంజూరైన కబడ్డీ సెంటర్‌కు సంబంధించిన మ్యాట్స్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు ట్రాక్సూట్లు, షూస్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరంతర సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి మరిన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి చిర్రా రఘు, మున్సిపల్ ఛైర్పర్సన్ బుర్రా కొమురయ్య, కబడ్డీ జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, సింగరేణి స్పోర్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు, సిబ్బంది పాల్గొన్నారు.

