అధికారులు మేల్కొనేందుకు ప్రాణనష్టం జరగాలా..?
మానాల గ్రామంలో కూలిపోనున్న విద్యుత్ స్తంభాలు
కథనాలు, ఫిర్యాదులకూ కదలని యంత్రాంగం
వర్షాకాలం ముందు గ్రామస్తుల్లో పెరుగుతున్న ఆందోళన
కాకతీయ, వేములవాడ : ప్రమాదం కళ్లముందే కనిపిస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుద్రంగి మండలం మానాల గ్రామంలో ప్రమాదకర స్థితికి చేరుకున్న విద్యుత్ స్తంభాలు ఎప్పుడు కూలిపోతాయోనన్న భయాందోళనల మధ్య గ్రామస్తులు గడుపుతున్నారు. అయినప్పటికీ సంబంధిత శాఖల నుంచి స్పందన లేకపోవడం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. మానాల–రుద్రంగి ప్రధాన రహదారిపై పలుచోట్ల విద్యుత్ స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా నిలిచాయి. ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది మంది రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు ప్రయాణిస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలోని పలు వీధుల్లో కూడా విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని స్తంభాలు నేలకు ఒరిగిపోగా, మరికొన్ని స్వల్ప గాలికే కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇవి ఎప్పుడు ప్రజలపై లేదా ఇళ్లపై పడతాయోనన్న భయంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

కథనాలు వచ్చాయి… ఫిర్యాదులు చేశారు… స్పందన మాత్రం లేదు
ఈ సమస్యపై గతంలోనే కాకతీయ ప్రత్యేక కథనాలు ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. గ్రామస్తులు సైతం పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. స్థానిక ఏఈ కృష్ణకాంత్‌కు కూడా సమస్యను వివరించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క స్తంభాన్ని కూడా మార్చలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశముంది. ఈదురుగాలులు, భారీ వర్షాల సమయంలో బలహీనంగా ఉన్న విద్యుత్ స్తంభాలు కూలిపోతే తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. రహదారిపై ప్రయాణిస్తున్న వారిపై లేదా సమీప ఇళ్లపై స్తంభాలు కూలిపోతే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ప్రాణాలు పోయాక స్పందిస్తారా..?
“స్తంభాలు వంగిపోయి ప్రమాద సంకేతాలు ఇస్తున్నాయి… పరిస్థితి అందరికీ కనిపిస్తోంది… అయినా అధికారులు ఎందుకు స్పందించడం లేదు..? ప్రాణనష్టం జరిగిన తర్వాతే చర్యలు తీసుకుంటారా..?” అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని, వర్షాకాలానికి ముందే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే స్పందిస్తారా..? లేక ప్రమాదం జరిగిన తర్వాత విచారణలకే పరిమితమవుతారా..? అనే ప్రశ్నకు విద్యుత్ శాఖ అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

