రెవెన్యూ అధికారులపై మొరం గ్యాంగ్ దాడి
అక్రమ మొరం తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లినందుకు దాష్టీకం
అధికారులను బంధించి, సెల్‌ఫోన్ల లాక్కున్న మాఫియా
నర్సంపేటలో జీపీఓ నరసింహస్వామి, మరో రెవెన్యూ ఉద్యోగిపై దారుణం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కాకతీయ, నర్సంపేట : “ప్రభుత్వ వనరులను అక్రమంగా దోచుకోవడమే కాకుండా, విధుల్లో ఉన్న అధికారులపైనే భౌతిక దాడికి దిగి బంధించడం మాఫియా తెగింపునకు నిదర్శనం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని దాడికి గురైన జీపీఓ నరసింహస్వామి, మరో రెవెన్యూ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట పట్టణ పరిధిలోని మాధన్నపేట చెరువు వద్ద అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారంతో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. అక్కడ అక్రమంగా మొరం తరలిస్తున్న వాహనాలను అడ్డుకోవడంతో నిందితులు రెచ్చిపోయారు.
ఘటనా స్థలిలో ఉద్రిక్తత
రెవెన్యూ బృందం అక్రమ తవ్వకాలను అడ్డుకుంటుండగా, మాటువేసిన అల్లరిమూకలు ఒక్కసారిగా అధికారులపై విరుచుకుపడ్డారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, వారిని గదిలో బంధించి బలవంతంగా సెల్‌ఫోన్లను లాక్కున్నారు. దాడిలో నరసింహస్వామికి, మరో ఉద్యోగికి గాయాలయ్యాయి. కొంతసేపటి వరకు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, అధికారులు చాకచక్యంగా వారి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు నర్సంపేట పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు. అక్రమ మొరం తవ్వకాల మాఫియా పైన, అధికారులపై దాడికి పాల్పడిన వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నర్సంపేట నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. అక్రమ రవాణాను అడ్డుకోవడంలో అధికారులు చూపుతున్న చొరవను పలువురు అభినందిస్తున్నారు.

