హామీల హోరు.. చేతల్లో చతికిల
కాంగ్రెస్‌పై చేర్యాలలో అంతులేని ‘అశాంతి’ జ్వాల!
ప్రభుత్వ వైఫల్యంపై నిప్పులు చెరుగుతున్న క్షేత్రస్థాయి శ్రేణులు
రుణమాఫీ, సాయం అందక రోడ్డెక్కిన అన్నదాతలు
నిధుల లేమితో నిస్సహాయ స్థితిలో గ్రామ సర్పంచ్‌లు
రెవెన్యూ డివిజన్ హామీని విస్మరించిన ముఖ్యమంత్రి
నాయకత్వ లోపంతో కుంటుపడిన నియోజకవర్గ ప్రగతి
ప్రభుత్వ-ప్రతిపక్ష సమన్వయ లోపంతో నత్తనడకన పనులు
కాకతీయ, చేర్యాల : అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగెత్తిస్తామంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, పీఠం ఎక్కాక జనగామ నియోజకవర్గ ప్రజలకు పాతాళ గరళాన్ని చూపిస్తోంది. హామీల అమలులో ప్రభుత్వం చూపిస్తున్న మీనమేషాలు, పాలనలో నెలకొన్న అనిశ్చితి, సొంత పార్టీ నేతల ఒంటెద్దు పోకడలు వెరసి.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచుతున్నాయి. అభివృద్ధిని ఆశించిన చేర్యాల ప్రజలకు, నేడు నిరాశే మిగిలింది. రాజకీయ సమన్వయ లోపం, ప్రజాప్రతినిధుల అలసత్వం వెరసి నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిపాయి.

రైతు కన్నీరు.. ప్రభుత్వం మొండి వైఖరి
రాష్ట్రానికి వెన్నెముక వంటి రైతును ఈ ప్రభుత్వం అడుగడుగునా అవమానిస్తోంది. రుణమాఫీ గాలిలో దీపం కాగా, సాగునీటి సౌకర్యాలు లేక, పంటలకు గిట్టుబాటు ధర దక్కక రైతన్నలు ఆత్మక్షోభకు గురవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో నమ్మబలికిన నేతలు, గెలిచిన తర్వాత కనీసం పొలాల గట్టున కూడా కనిపించకపోవడం రైతులలో తీవ్ర ఆగ్రహాన్ని నింపుతోంది. పెట్టుబడి సాయం మొదలు పంట నష్టపరిహారం వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మరోవైపు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో రైతుల ఖాతాల్లోకి నిధులు రాక, గిడ్డంగుల్లో ధాన్యం కొనుగోలు జరగక అన్నదాత రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది.

నిధుల కొరతతో కుంటుపడిన గ్రామీణ పాలన
గ్రామ స్వరాజ్యానికి పునాదులైన సర్పంచ్‌ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ప్రభుత్వం నిధుల విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో కనీస పారిశుధ్య పనులు, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక సేవలు స్తంభించిపోయాయి. బిల్లులు రాక సర్పంచ్‌లు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రజా సమస్యలపై నిలదీసే ప్రజల ముందు సమాధానం చెప్పలేక, అధికారుల దగ్గర చేతులు కట్టుకుని నిలబడలేక సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. అభివృద్ధి పనుల పేరిట గ్రామాల్లో కేవలం ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం, నిధుల విడుదలలో మాత్రం ఎందుకో వెనకడుగు వేస్తోందన్నది స్పష్టమవుతోంది. ఇది స్థానిక సంస్థల వ్యవస్థనే నిర్వీర్యం చేస్తోంది.
మాట తప్పిన సీఎం.. రెవెన్యూ డివిజన్ ఒక ఎండమావి!
చేర్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం ‘రెవెన్యూ డివిజన్’. ఎన్నికల వేళ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పుడు ప్రజలను వెక్కిరిస్తోంది. అధికారంలోకి వచ్చాక ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం, కనీస స్పందన లేకపోవడం చేర్యాల వాసులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని నమ్మబలికిన పాలకులే, ఇప్పుడు ప్రజల ఆకాంక్షలను కాలరాస్తుండటం దేనికి సంకేతం? ఇది కేవలం పాలనాపరమైన వైఫల్యమే కాదు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు. ఈ నిర్లక్ష్యం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బ కానుంది.
విద్యా రంగాన్ని సైతం కాంగ్రెస్ పాలన తన అనాలోచిత విధానాలతో అతలాకుతలం చేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో జాప్యం, నిబంధనల పేరుతో ప్రైవేట్ కళాశాలలపై అంతులేని ఆంక్షలు విద్యాసంస్థల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మౌలిక సదుపాయాలు లేక, ఆర్థికంగా కళాశాలలు చితికిపోతుండటంతో యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక చేర్యాల నియోజకవర్గంలో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సమర్థవంతమైన నాయకుడు లేకపోవడం, అధికార యంత్రాంగంపై పర్యవేక్షణ కరువవ్వడం వల్ల నియోజకవర్గం అభివృద్ధిలో నత్తనడకన సాగుతోంది. రాజకీయంగా అధికార పార్టీ మరియు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం, చేర్యాల ప్రజల పాలిట శాపంగా మారింది. అభివృద్ధి జరగకపోవడానికి రాజకీయ కక్షలే కారణమన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజలు ఇచ్చే తీర్పు మరింత కఠినంగా ఉంటుందన్నది కాదనలేని వాస్తవం.

