తెలంగాణ ‘జన’ సునామీ.. 4.20 కోట్లకు చేరిక!
16 ఏళ్లలో 70 లక్షల పెరిగిన జనాభా..
కోటిన్నర దాటిన హైదరాబాద్ మహానగర జనాభా
కోటీ 20 లక్షలకు చేరిన కుటుంబాల సంఖ్య..
భారీగా పెరిగిన వలసలు, గృహ నిర్మాణాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర గమనాన్ని మార్చేసే కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర జనాభా లెక్కల విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గత నెల 11 నుంచి ఈ నెల 9 వరకు చేపట్టిన మొదటి దశ జనగణన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. రాష్ట్ర జనాభా ఇప్పటికే 4.20 కోట్లు దాటేసిందని అధికార వర్గాల ప్రాథమిక అంచనా. 2010-11 నాటి జనాభా లెక్కలతో పోలిస్తే, గడిచిన 16 ఏళ్లలో వార్షిక వృద్ధి రేటు 1.25 శాతంతో అదనంగా 70 లక్షల మంది జనాభా పెరిగినట్లు స్పష్టమవుతోంది.
విస్తరిస్తున్న గ్రేటర్.. కోటిన్నర దిశగా!
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ నగరం, జనాభాకు ప్రధాన కేంద్రంగా మారింది. 2011 నాటికి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల జనాభా 92 లక్షలుగా ఉండేది. నేడు, కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే ఈ సంఖ్య కోటిన్నర మార్కును అవలీలగా దాటేసిందని అంచనా. 300 డివిజన్లను 20 వేల హౌస్ లిస్టింగ్ బ్లాకులుగా విభజించి చేపట్టిన ఈ సర్వేలో, నగరంలో సుమారు 45 లక్షల ఇళ్లు ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా లెక్కించారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబాల విస్తరణ కూడా ఆశ్చర్యపరిచేలా ఉంది. 2010-11 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న 83 లక్షల కుటుంబాల సంఖ్య, నేడు కోటీ 20 లక్షలకు చేరింది. అంటే సుమారు 37 లక్షల కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయని, ఇది రాష్ట్ర ఆర్థిక, సామాజిక మార్పులకు అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పకడ్బందీగా మొదటి దశ..
రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది ఉద్యోగులు నెలా రోజుల పాటు పగలు, రాత్రి కష్టపడి ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించారు. ఇళ్ల సంఖ్య, మౌలిక సదుపాయాలు, కుటుంబ పెద్ద పేరు, సభ్యుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అయితే, ఒకే కుటుంబం వివరాలు రెండుసార్లు నమోదు కావడం లేదా ఏదైనా ఇంటిని వదిలేయడం వంటి పొరపాట్లు జరిగి ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీ ఇంటికి సర్వే సిబ్బంది ఇంకా రాకపోతే, ఈ గురువారంలోగా సమీపంలోని మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి తమ వివరాలను నమోదు చేయించుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఫిబ్రవరి 2027.. అసలైన లెక్కల కోసం నిరీక్షణ!
ప్రస్తుత సర్వే కేవలం ‘హౌస్ లిస్టింగ్’ ప్రక్రియ మాత్రమే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే రెండో దశలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలను, సామాజిక, ఆర్థికాంశాలను కూలంకషంగా సేకరిస్తారు. రెండు దశల సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత, 2027 చివరికి లేదా 2028 ఆరంభానికల్లా తుది జనాభా వివరాలను కేంద్రం అధికారికంగా ప్రకటించనుంది. అప్పుడే తెలంగాణ రాష్ట్ర సమగ్ర జనాభా చిత్రపటం స్పష్టంగా బయటపడనుంది.

