రసాయన ఎరువులు వదలండి
ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లండి
25 వేల మందిని సేంద్రీయ సాగువైపు తీసుకెళ్తాం
ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు
రైతులకు పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్ : రసాయన ఎరువులతో పండించిన పంటలను తినడం అంటే డబ్బులు ఇచ్చి రోగాలను కొనుగోలు చేయడమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో గురువారం జరిగిన ‘ప్రకృతి వ్యవసాయంపై రైతుల సమ్మేళనం’లో ఆయన పాల్గొన్నారు. రైతులు ఇకనైనా రసాయనాల వాడకాన్ని తగ్గించి ప్రకృతి సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు కేంద్రం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 25 వేల మంది రైతులను సేంద్రీయ సాగులోకి తీసుకువస్తామని ప్రకటించారు. జమ్మికుంట కేవీకే ఆధ్వర్యంలో ఇప్పటికే 19 గ్రామాల్లో 10 వేల ఎకరాల్లో సేంద్రీయ సాగు జరుగుతోందని, భవిష్యత్తులో దీనిని 50 వేల ఎకరాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు – ఆర్థిక లబ్ధి
రసాయనాల వినియోగంతో నేల సారం దెబ్బతింటోందని, పంజాబ్ వంటి ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులు పెరగడం దీనికి నిదర్శనమని మంత్రి హెచ్చరించారు. విదేశీ ఎరువుల దిగుమతుల కోసం ఏటా రూ. 1.20 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, దేశ సంపదను కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గమని చెప్పారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన, పీఎం-ప్రణామ్ వంటి పథకాల ద్వారా సేంద్రీయ సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున ప్రోత్సాహం అందిస్తున్నట్లు వివరించారు. రైతులు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకరమైన ఆహార సాగును చేపట్టాలని ఆయన కోరారు.
ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లడం వల్ల ఆహార భద్రతతో పాటు ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయి. రసాయనాలపై ఆధారపడటం తగ్గడం వల్ల రైతుల సాగు ఖర్చులు తగ్గి, ఆర్థిక స్వావలంబన పెరుగుతుంది. తద్వారా నేల తల్లికి ప్రాణం పోస్తూ, విషరహిత సమాజాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది.

