బద్ది పోచమ్మకు బోనాలు
మున్నూరు కాపుల ఆధ్వర్యంలో వేడుకలు
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు సమర్పించిన భక్తులు
కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో గురువారం మున్నూరు కాపు పటేల్ సంఘం-2 ఆధ్వర్యంలో గ్రామదేవత బద్ది పోచమ్మ, పోచమ్మ, తాతమ్మలకు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఉదయం నుంచే గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ బోనాలను తలపై మోసుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, వర్షాలు బాగా కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రదాయం ప్రకారం యాటా పిల్లలను కొయ్యడం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు నాయిని రవి, నాయిని శ్రీను, అల్లూరి మహేష్, సిరవేణి గంగారెడ్డి, తోట మధు, పుప్పాల జలేందర్, నాయిని రెడ్డి, అల్లూరి నడిపి నర్సయ్య, మహిళలు, యువతీ యువకులు పాల్గొన్నారు.

