బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి : కలెక్టర్
కాకతీయ, కరీంనగర్: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో ఆమె కార్మిక శాఖ రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిల్లలు బాల కార్మికులుగా మారకుండా, పాఠశాలలకు వెళ్లి విద్యను అభ్యసించేలా చూడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు. బాలల హక్కుల పరిరక్షణలో ప్రజలు చురుకుగా పాల్గొనాలని, ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కోలా ప్రసాద్, సహాయ కమిషనర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో చైతన్యం వస్తేనే బాల కార్మిక వ్యవస్థను అరికట్టడం సాధ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

