ప్రతి డివిజన్ అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్
రూ.27 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు శంకుస్థాపన
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
మొదటగా 1వ డివిజన్ అరెపల్లిలో మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.27 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి, డ్రైనేజీ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
అనంతరం 26వ డివిజన్‌లో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన పూడికతీత పనులను ప్రారంభించారు. మురుగు కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్‌లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ నిరంతరం పనిచేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ బారి అపర్ణ జితేందర్, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, కార్పొరేటర్ బండారి వేణు, కో-ఆప్షన్ సభ్యులు చిగిరి వెంకటమ్మ, సరిల్ల ప్రసాద్, కొంపల్లి రమణ్, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

