ఇందుర్తిలో కిరాణా వ్యాపారుల నిలువు దోపిడీ
కాకతీయ, చిగురుమామిడి: ఇందుర్తి గ్రామంలోని కిరాణా దుకాణాల్లో వ్యాపారులు సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ప్యాక్ చేసిన నిత్యావసరాలు, కూల్‌డ్రింక్స్, పాలు, పెరుగు వంటి పదార్థాలపై ముద్రించిన ఎమ్మార్పీ కంటే రూ. 3 నుండి రూ. 6 వరకు అదనంగా వసూలు చేయడం నిత్యకృత్యంగా మారింది. ప్రశ్నిస్తే గిట్టుబాటు కావడం లేదని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. అంతేకాకుండా, నిబంధనలను తుంగలో తొక్కి కాలం చెల్లిన బిస్కెట్లు, చాక్లెట్లు, కుర్కురే ప్యాకెట్లను విక్రయిస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఉదాసీనత వీడాలని వారు కోరుతున్నారు.

