జాతీయ రహదారిపై మృత్యు ఘంటికలు
స్పీడ్ బ్రేకర్లు లేక పెరిగిన ప్రమాదాలు
మరమ్మతుల పేరుతో మరిచిన సూచికలు
రోజూ భయాందోళనలో పాదచారులు విద్యార్థులు
కాకతీయ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఇటీవల చేపట్టిన మరమ్మతు పనులు స్థానికంగా కొత్త చిక్కులను తెచ్చిపెట్టాయి. రహదారికి కొత్తగా డంబార్ వేసి పునరుద్ధరించినప్పటికీ, గతంలో ఉన్న స్పీడ్ బ్రేకర్లను తిరిగి ఏర్పాటు చేయడం లేదా అవసరమైన చోట హెచ్చరిక సూచికలు అమర్చడం అధికారులు మరిచిపోవడంతో ప్రయాణికులు మృత్యుఘంటికల మధ్య ప్రయాణించాల్సి వస్తోంది. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి బస్ స్టాండ్ వరకు ఉన్న ప్రాంతంలో వాహనాలు అధిక వేగంతో దూసుకుపోతున్నాయి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల సమీప ప్రాంతం కావడంతో రోడ్డు దాటే పాదచారులు, విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు అధికంగా సంచరిస్తుంటారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది.
అప్రమత్తం కావాల్సిన అవసరం
ఈ నేపథ్యంలో రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి అంబేడ్కర్ చౌరస్తా నుంచి బస్ స్టాండ్ వరకు అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం రోడ్డు వేయడమే కాకుండా, ప్రమాదాలను నివారించేందుకు హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రాణనష్టం మరింత పెరగక ముందే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

