సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి ఫైర్
కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై అసహనం
కార్యకర్తను అనుకుంటుండా అంటూ డిఎస్పీకి ప్రశ్న
బిఆర్ఎస్ పార్టీలో చేరమని సూచన
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా ఎస్పీపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో ప్రధానమంత్రి 12 సంవత్సరాల పాలన పురస్కరించుకొని బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన “మన బడి–మన బాధ్యత” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ క్రమంలో ఎస్పీ మహేష్ బి గీతె కార్యక్రమంలో కనబడకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్రచారి కేంద్ర మంత్రికి పూల మొక్కతో స్వాగతం పలికారు. దాంతో డిఎస్పీతో ఎస్పీ కార్యక్రమానికి ఎందుకు రాలేదని, నేను ఏమైనా కార్యకర్తను అనుకుంటుండా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అంటే ఎస్పీకి ఎందుకంత కోపమని, కేటీఆర్ అంటే ఇష్టమైతే ఆయన వెంటే తిరగమని చెప్పారు. బిఆర్ఎస్ అంటే ఎస్పీకి అంత ప్రేమ ఉంటే, కావాలంటే ఎస్పీని బిఆర్ఎస్ పార్టీలో చేరుమని డీఎస్పీకి కేంద్రమంత్రి బండి సంజయ్ సూచించారు. కేంద్రమంత్రి, పైగా కేంద్ర హోంశాఖమంత్రి సిరిసిల్ల పర్యటనకు జిల్లా ఎస్పీ హాజరు కాకపోవడం.. దానిని కేంద్రమంత్రి ప్రశ్నించడం ఇప్పుడు జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది.

