కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
వడదెబ్బతో మృతి చెందిన నూకల ప్రకాష్‌కు నివాళులు
కాకతీయ, పరకాల: పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం దుర్గంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నూకల వీరేశం సహోదరుడు నూకల ప్రకాష్ వడదెబ్బతో మృతి చెందగా, శనివారం ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ధర్మారెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం మండలంలోని ఊరుగొండ గ్రామంలో ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ నాయకులు చెట్టుపల్లి విజేందర్ కుటుంబ సభ్యులను, అలాగే యూత్ నాయకులు జన్ను అమరేందర్ మాతృమూర్తి స్వరూప కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. అదేవిధంగా దామెర మండలం ల్యాదేళ్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ కన్నెబోయిన రమేష్ యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా, వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు.

