కాంగ్రెస్ అంటేనే కరువు..
రైతుల గోస ఆ ప్రభుత్వానికి తగులుతుంది
కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు తప్పని కష్టాలు
బీఆర్ఎస్ హయాంలో రైతులకు పెద్దపీట వేసిన కేసీఆర్
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాలలో 56 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
త్వరలో ప్రారంభం కానున్న బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని వెల్లడి
కాకతీయ, చేర్యాల : కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం కల్పించారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ అంటేనే కరువు అని, రైతుల గోస ఆ ప్రభుత్వానికి తగులుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మద్దతు ధర సమస్యలు, బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సౌకర్యాలు, ధాన్యం కొనుగోలు వంటి పథకాలతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటూ.. చేర్యాల, మద్దూర్, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల లబ్ధిదారులైన 56 మందికి ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
సభ్యత్వ నమోదుకు పిలుపు.. మౌలిక వసతుల కల్పన
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో కార్యకర్తలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను గ్రామ స్థాయి నుంచి సమర్థవంతంగా నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ పార్టీలో సభ్యులుగా చేర్చేలా కృషి చేయాలన్నారు. అదే విధంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇళ్లు అందించడంతో పాటు గ్రామాలు, కాలనీల్లో నాణ్యమైన రహదారుల నిర్మాణాలు చేపడుతామని చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

