మార్కెట్లలో రైతులపై భారం తగ్గించండి
ఏనుమాముల మార్కెట్ చైర్‌పర్సన్‌కు రైతు సంఘం వినతి
60 రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు
సానుకూలంగా స్పందించిన చైర్‌పర్సన్ ప్రియాంక
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వ్యవసాయ మార్కెట్లలో వివిధ రుసుముల పేరుతో రైతులపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యర్రా ప్రియాంకకు రైతు సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, లక్ష్మీపురం పండ్ల మార్కెట్ మరియు కూరగాయల మార్కెట్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ఓదెల రాజయ్య మాట్లాడుతూ.. పంటకు సరైన రక్షణ లేకపోవడం, వర్షాలకు పంట నానిపోవడం, సరైన ధర లభించకపోవడం మరియు అదనపు ఖర్చులు వసూలు చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో చాలామంది రైతులు గ్రామాల్లోనే తక్కువ ధరకే పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారని, దీనివల్ల ప్రభుత్వ మార్కెట్లకు పంట రాక ఆదాయం పడిపోతోందని పేర్కొన్నారు.
రైతు సంఘం ప్రధాన డిమాండ్లు:
రైతు పంట మార్కెట్‌కు తీసుకొచ్చినప్పుడు ఎలాంటి ఖర్చులు లేకుండా మార్కెట్ కమిటీయే భరించాలి.
రైతులకు ఉచిత టిఫిన్, భోజన సౌకర్యం కల్పించాలి. మార్కెట్ పక్కన 37 గుంటల స్థలంలో కాంప్లెక్స్ నిర్మించి రైతు విశ్రాంతి భవనం, అవగాహన తరగతులు ఏర్పాటు చేయాలి. వరంగల్ సిటీ పక్కన 30 ఎకరాల్లో ఆధునిక పండ్ల మార్కెట్ నిర్మించాలి. లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో రైతులకు 1 ఎకరం స్థలం కేటాయించి, గద్దెలను తొలగించి విశాలంగా మార్చాలని డిమాండ్ చేశారు.
60 రోజుల్లో చర్యలు:
రైతు సంఘం ప్రతినిధుల వినతిపై ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యర్రా ప్రియాంక సానుకూలంగా స్పందించారు. 60 రోజుల్లోపు అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండి జనార్ధన్, డైరెక్టర్లు ఆకుల రుద్రప్రసాద్, గాజుల శ్యామ్, రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఊరటి అంశాలరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

